హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న కలెక్టర్
డుంబ్రిగుడ: రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కలెక్టర్ టి. నిశాంతి స్వయంగా రంగంలోకి దిగారు. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘హెల్మెట్ తప్పనిసరి’ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా హెల్మెట్ ధరించి, ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. పోలీసు శాఖ చేపట్టిన ఈ వినూత్న అవగాహన కార్యక్రమం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.


