● కలెక్టర్‌ నిశాంతి హెచ్చరిక ● పీజీఆర్‌ఎస్‌ వేదికగా 88 అర్జీలు స్వీకరణ ● జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

● కలెక్టర్‌ నిశాంతి హెచ్చరిక ● పీజీఆర్‌ఎస్‌ వేదికగా 88 అర్జీలు స్వీకరణ ● జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో నిర్వహణ

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

● కలెక్టర్‌ నిశాంతి హెచ్చరిక ● పీజీఆర్‌ఎస్‌ వేదికగా 88 అర్జీలు స్వీకరణ ● జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో నిర్వహణ

అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే

కఠిన చర్యలు

డుంబ్రిగుడ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ టి. నిషాంతి అధికారులను హెచ్చరించారు. దరఖాస్తులపై సంబంధిత అధికారులు అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. వివిధ సమస్యలపై మొత్తం 88 అర్జీలు నమోదయ్యాయి. భూ సమస్యలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, సరిహద్దు వివాదాలకు సంబంధించి 10, పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ, విద్యుత్‌, తాగునీరు, రహదారులు, అంగన్‌వాడీ భవనాలు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తం 78 అర్జీలు దాఖలయ్యాయి.

గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపాలి

వచ్చిన వినతులపై కలెక్టర్‌ తక్షణమే స్పందిస్తూ.. ఆయా శాఖల అధికారులు అర్జీదారులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఒకవేళ సాంకేతిక లేదా చట్టపరమైన కారణాల వల్ల సమస్యను తిరస్కరించాల్సి వస్తే.. అందుకు గల కారణాలను ఫిర్యాదుదారునికి స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు.

అర్జీదారుల సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించినప్పుడే ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో ప్రతికూల స్పందన రాదన్నారు. అధికారులు అర్జీదారులతో సక్రమంగా మాట్లాడకపోవడం, సమస్యలను సరిగ్గా పరిష్కరించకపోవడం వల్లే ఒకే అర్జీ పదేపదే రీ–ఓపెన్‌ అవుతోందని, ఈ విషయాన్ని అధికారులు గమనించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (ఎఫ్‌ఏసీ) ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ నీలకంఠరావు, జెడ్పీ సీఈవో సత్యనారాయణ, ఐటీడీఏ ఏపీవోతో పాటు జిల్లా, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ: మండల కేంద్రంలో బుధవారం కలెక్టర్‌ టి. నిషాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజలు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ పథకం పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో ఉపాధి హామీ పనుల నిర్వహణలో ముందంజలో ఉన్నందుకు గాను స్థానిక అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్‌ అభినందించారు. ఈ పర్యటనలో భాగంగా అంతకుముందు మండల కేంద్రంలో నిర్వహించిన ‘స్వచ్ఛ పథం’ కార్యక్రమంలో కలెక్టర్‌, జేసీలు స్వయంగా పాల్గొన్నారు. చేతుల్లో చీపుర్లు పట్టి వీధులను శుభ్రం చేస్తూ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక ఎంపీపీ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో విశ్వనాథ్‌, తహసీల్దార్‌ త్రివేణి, ఎంఈవోలు శెట్టి సుందర్‌రావు, జి. గెన్ను, పంచాయతీ కార్యదర్శులు విజయ్‌, గౌతమి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement