డెయిరీ నగర్‌ గిరిజనులకు ఇళ్ల పట్టాలు | - | Sakshi
Sakshi News home page

డెయిరీ నగర్‌ గిరిజనులకు ఇళ్ల పట్టాలు

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

● జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ ● 39 మందికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం

చింతపల్లి: చింతపల్లి మేజర్‌ పంచాయతీ పరిధిలోని డెయిరీ నగర్‌లో నివాసముంటున్న గిరిజనులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు తక్షణమే పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె మండల కేంద్రం పరిధిలోని డెయిరీ నగర్‌ గ్రామాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. గడిచిన కొన్నేళ్లుగా తాము ఈ ప్రాంతంలోనే నివాసముంటున్నప్పటికీ.. నేటికీ ఇళ్ల పట్టాలు లేకపోవడం వల్ల ఎటువంటి ఆర్థిక ప్రోత్సాహకాలను అందుకోలేకపోతున్నామని, పక్కా ఇళ్లు కూడా మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పాడేరు పీజీఆర్‌ఎస్‌ (మీకోసం) వేదికగా జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అర్జీలపై సానుకూలంగా స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌, నేరుగా గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. గ్రామంలో అర్హులైన 39 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేలా సమగ్ర విచారణ జరిపి, పూర్తి స్థాయి నివేదికను తనకు అందజేయాలని తహసీల్దార్‌ శంకరరావును ఆదేశించారు. అదేవిధంగా, ఈ గ్రామంలోని గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వ్యవసాయ పరంగా అవసరమైన ప్రభుత్వ సహాయ సహకారాలను అందిస్తామని జేసీ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో చింతపల్లి ఆర్‌ఐ కృష్ణమూర్తి, స్థానిక రెవెన్యూ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement