తుమ్మపాల/రామికమతం: రావికమతం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో చోడవరం కోర్టు నిందితుడికి మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఈ నెల 20న తీర్పు వెలువరించినట్టు ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఒక ప్రకటలో బుధవారం తెలిపారు. ఈ మేరకు కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను, కోర్టులో సమర్ధవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గత ఏడాది ఆగస్టు 21న రావికమతం గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు గెంజి దేవి తమ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు అర తులం బంగారం, 50 తులాల వెండి, రూ.1, లక్ష నగదు దొంగిలించారని రావికమతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రావికమతం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ కె.ఈశ్వరకుమార్ ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఎం.రఘువర్మ సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేసి విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం, కొత్తపాలెం గ్రామానికి చెందిన నిందితుడైన గొల్లపూడి శ్రీనును అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీ సొత్తు వెండి, నగదును రికవరీ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. దర్యాప్తు అధికారి నిర్దేశిత సమయంలోనే పకడ్బందీగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం చోడవరం ఏజెఎఫ్‌సిఎం కోర్టు ఇన్‌చార్జి మేజిస్ట్రేట్ బి.వి.విజయలక్ష్మి ఎదుట నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరిప్రియ దేవరకొండ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చట్టపరమైన వాదనలు వినిపించారు. నేరం పూర్తిగా రుజువు కావడంతో శిక్షను విధించినట్టు ఆయన తెలిపారు.


