కోటవురట్ల: అగ్ర వర్ణానికి చెందిన ఓ వ్యక్తి అకారణంగా తనపై దాడి చేసి కులం పేరుతో దూషించాడని ఓ వృద్ధుడు స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. వివరాలివి..అన్నవరం గ్రామంలో మాదిగ కులానికి చెందిన పెదపూడి రాంబాబు తన ఇంటి ముందు కుర్చీలో కూర్చుని వుండగా అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన దుబాసి సురేష్ అనే వ్యక్తి అటుగా వస్తూ కులం పేరుతో దూషించి నేను వస్తుంటే కుర్చీలో కూర్చుని వుంటావా అంటూ కర్రతో దాడి చేశాదని, తలకు తీవ్ర గాయం కావడంతో అతని భార్య కేకలు వేయగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారని, అయినా కులం పేరుతూ దూషిస్తూ దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాయానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్టు బాధితుడు తెలిపాడు. తనను కులం పేరుతో దూషించి గాయపరిచినందుకు సురేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కేసు వివరాలను ఉన్నతాధికారులకు తెలిపి విచారణ చేస్తామని ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.


