కేజీహెచ్‌.. | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌..

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

ఆసుపత్రి అవుట్‌ పేషెంట్‌ విభాగంలో స్తంభించిన సర్వర్‌

గంటన్నర పాటు ఓపీ సేవలు బంద్‌

ఉక్కపోతతో కూలైన్లలో రోగులు, వారి కుటుంబ సభ్యుల పడిగాపులు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని అధికారులు

సర్వర్‌ డౌన్‌.. రోగులు విల విల..

మహారాణిపేట(విశాఖ): అటు భానుడి భగభగలు.. ఇటు ఊపిరాడని ఉక్కపోత.. ఆపై గంటన్నరపాటు నిలిచిపోయిన ఓపీ సర్వర్‌! వెరసి విశాఖ కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి(కేజీహెచ్‌) అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) విభాగం బుధవారం నరకప్రాయంగామారింది. సాంకేతిక స మస్యల కారణంగా ఓపీచీటీ జారీకి తీవ్ర అంతరా యం కలిగింది. ఎండ వేడిలో ఓపీ కోసం వేచి ఉన్న రోగులు, వారి బంధువులకు చుక్కలు చూపించింది. సర్వర్‌ పనిచేసిన తర్వాత కూడా రద్దీకి తగ్గట్లు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహా నికిగురైన రోగులు ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు.

సాంకేతిక లోపాలు.. పేదలకు శాపాలు!

కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందాలంటే ‘ఏబీహెచ్‌ఏ’ యాప్‌ ద్వారా ఓపీ టిక్కెట్ల జారీని ఆసుపత్రి వర్గాలు తప్పనిసరి చేశాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగుల వద్ద స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం, ఒకవేళ ఉన్నా నెట్‌వర్క్‌ సిగ్నల్‌ అందకపోవడం, ఆధార్‌ అప్‌డేట్‌ కాకపోవడం, వేలిముద్రలు పడకపోవడంతో ఒక్కో టిక్కెట్‌ జారీకి గంటల సమయం పడుతోంది. దీనికి తోడు బుధవారం ఉదయం నుంచే ఆన్‌లైన్‌ సర్వర్‌ పూర్తిగా మొరాయించడంతో ఎన్నడూ లేని విధంగా ఓపీ కౌంటర్లన్నీ రోగులు, వారి సహాయకులతో కిక్కిరిసిపోయాయి. సర్వర్‌ పనిచేయకపోవడంతో చేసేదేమీ లేక సిబ్బంది సైతం చేతులెత్తేసి ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది.

సాధారణం కంటే రెట్టింపు రద్దీ

కేజీహెచ్‌ ఓపీ విభాగంలో నిత్యం సగటున 1200 నుంచి 1300 వరకు టిక్కెట్లు జారీ అవుతుంటాయి. కానీ బుధవారం ఆ సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. కేజీహెచ్‌ పరిధిలోని 26 విభాగాలకు సంబంధించి క్యాజువాలిటీ వద్ద 3, ఓపీ విభాగంలో 7 కౌంటర్ల ద్వారా మొత్తం 2,589 ఓపీ టిక్కెట్లు, ఆసుపత్రిలో చేరే రోగుల కోసం 120 కే–షీట్‌లను జారీ చేశారు. ఉదయం 8:30 గంటలకే కౌంటర్లు కిక్కిరిసిపోవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు రద్దీ కొనసాగింది. క్యూలైన్లను అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బందికి సైతం పెద్ద తలనొప్పిగా మారింది. ఆన్‌లైన్‌ విధానంలో రోగి పేరు, వయస్సు, చిరునామాతో పాటు వెళ్లాల్సిన ఓపీ విభాగాన్ని కూడా టిక్కెట్‌పై ముద్రించాల్సి రావడంతో మరింత జాప్యం జరిగింది.

కౌంటర్లలో సరిపడా ఫ్యాన్లు లేవు!

రోగులే కాకుండా కౌంటర్లలో విధులు నిర్వహించే సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఆన్‌లైన్‌ కౌంటర్లలో ఏసీ సదుపాయమే కాదు, సరిపడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది చెమటలు కక్కుతూనే పని చేయాల్సి వచ్చింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత తోడవ్వడంతో రోగుల అసహనం కట్టలు తెంచుకుంది. ఇప్పటికై నా కేజీహెచ్‌ అధికారులు స్పందించి, సర్వర్‌ సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

సహాయకులు లేక..

సాధారణంగా కేజీహెచ్‌కు వచ్చే రోగులకు, వారి బంధువులకు మొబైల్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం, ఆన్‌లైన్‌ టిక్కెట్లు తీయడంలో నర్సింగ్‌ విద్యార్థినులు దగ్గరుండి సహాయం అందిస్తుంటారు. అయితే వేసవి సెలవుల కారణంగా బుధవారం విద్యార్థినులు విధులకు రాలేదు. విద్యార్థినులు రాని పక్షంలో ఆసుపత్రి అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కౌంటర్ల వద్ద గందరగోళం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement