సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న
దేవరాపల్లి: మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు అత్యంత కీలకమైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూసివేసి, కొత్తగా సెజ్‌ల పేరిట పేద రైతులు, దళితులు, గిరిజనులు భూములను కాజేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తో సహా టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో రూ. 5వేల కోట్ల పెట్టుబడులతో మాడుగుల నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టిన ఎమ్మెల్యే రైతు ఆధారిత సుగర్ ఫ్యాక్టరీని నడిపించలేక పోయారని పేర్కొన్నారు. పేద గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని, దీనికి రైతులంతా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేవరాపల్లి మండలంలో కొండకొడాబు, సమ్మెద, కొత్తూరు, చింతలపూడి, కోరాడ గ్రామాల్లో అధాని హైడ్రో పవర్ ప్లాంట్ పేరిట 820 ఎకరాలను, చీడికాడ మండలం జి.కొత్తపల్లి, అడవిల అగ్రహారం, చినగోగాడ, బైలపూడి గ్రామాలలో సోలార్ ప్లాంట్ పేరిట 262 ఎకరాలను, కె.కోటపాడు మండలం ఆర్లి, గుల్లేపల్లి, చింతపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో ఎస్‌ఈజెడ్ పేరు చెప్పి 10,250 ఎకరాలు, మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీలో వీఎంఆర్డీఏ పేరిట 110 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నాయుకులు ఎక్కడ మీటింగ్ పెట్టిన భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని అన్నదాతలు తెగేసి చెబుతున్నా పోలీసులతో రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో సైతం హైడ్రోప్లాంట్ పేరిట బలవంతంగా గిరిజనుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తున్నారన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కంపెనీలు రాకపోయిన భూ బ్యాంక్ పేరిట పేద రైతుల నుంచి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోని ప్రభుత్వం రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి పూనుకుందని విమర్శించారు. ఇప్పటికే సెజ్ పేరిట పరవాడ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశారని, పచ్చని పంట పొలాలతో నిండి ఉన్న మాడుగుల నియోజకవర్గాన్ని కాలుష్యంతో నింపి సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు నియోజకవర్గంలోని రైతుల పట్ల ప్రేమ ఉంటే ముందుగా సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరిట పేదల భూములను కాజేయాలని చూస్తే సీపీఎం రైతులు, గిరిజనులతో కలిసి ప్రజా ఉద్యమాన్ని చేపట్టి భూములను రక్షించుకుంటామని సీపీఎం నేత వెంకన్న స్పష్టం చేశారు.


