మోదమ్మా..తోడుండమ్మా! | - | Sakshi
Sakshi News home page

మోదమ్మా..తోడుండమ్మా!

May 20 2026 1:40 AM | Updated on May 20 2026 1:40 AM

పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, గిరిజనుల ఇలవేల్పు అయిన పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర ముగింపు వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను భారీ ఊరేగింపుతో సతకం పట్టు వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. అక్కడ మూడు రోజుల పాటు భక్తుల నుంచి అమ్మవారు విశేష పూజలందుకున్నారు.

కనులపండువగా తిరుగు ప్రయాణం

జాతర చివరి రోజున వేదమంత్రోచ్ఛారణలు, సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ థింసా నృత్యాలు, శక్తి వేషధారణల మధ్య అమ్మవారి ఊరేగింపు కనులపండువగా సాగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మోయగా.. అమ్మవారి పాదాలను కలెక్టర్‌ నిశాంతి, ఘటాలను జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి, భక్తులు భుజాలపై మోస్తూ ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి చేర్చారు. దీంతో మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

దర్శించుకున్న ప్రముఖులు

జాతర ముగింపు రోజున పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఉదయమే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్‌ నిశాంతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా ముగిసిన మోదకొండమ్మ

రాష్ట్ర గిరిజన జాతర

తరలివచ్చిన భక్తజనం

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్‌ మత్స్యరాస

విశ్వేశ్వరరాజు

పాదాలు, ఘటాలను మోసిన కలెక్టర్‌ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ,పీవో ఆదిత్యవర్మ

Advertisement
 
Advertisement
Advertisement