పాడేరు: పాడేరు శ్రీ మోదకొండమ్మ రాష్ట్ర గిరిజన జాతర చివరి రోజున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం ఉదయం వేకువజాము నుంచే దట్టమైన మంచు కమ్ముకోగా.. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో ఏకధాటిగా సుమారు మూడు గంటల పాటు కుంభవృష్టి కురవడంతో పట్టణమంతా తడిసి ముద్దయింది.
దుకాణాలు మునిగి..
జాతర ముగింపు రోజున భారీగా వ్యాపారం జరుగుతుందని ఆశించిన చిరు వ్యాపారులను ఈ అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. రోడ్డు పక్కన, మైదానాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారుల సామగ్రి అంతా తడిసిపోయింది. ఆకస్మిక వరద నీరు చేరడంతో దుకాణదారులు ఎన్నో అవస్థలు పడ్డారు.
నాలుగు గంటలు అంధకారం..
భారీ ఈదురుగాలుల కారణంగా పట్టణంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు నాలుగు గంటల పాటు కరెంట్ నిలిచిపోవడంతో జాతర పరిసర ప్రాంతాలన్నీ చీకటమయమయ్యాయి. జాతర ముగింపు వేడుకలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు కారుచీకట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. సరైన సమయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు సాయంత్రం ఏడు గంటలకు అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పాడేరులో ఈదురు గాలులతో
భారీ వర్షం
నాలుగు గంటలపాటు నిలిచిన
విద్యుత్ సరఫరా
కారుచీకట్లో మోదకొండమ్మ
భక్తుల అవస్థలు


