● యథేచ్ఛగా తయారీ, విక్రయాలు
● పూటుగా తాగి అనారోగ్యం
బారిన పడుతున్న గిరిజనులు
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజన, అటవీ ప్రాంతాల్లో ప్రాంతంలో సారా ఏరులైపారుతోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. వారపు సంతల్లో, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పంచాయతీల్లో జోరుగా సారా అమ్మకాలు జరుగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో సారాను తయారు చేసి, మండలంలో అన్ని గ్రామాలకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. సారా తయారు చేసేందుకు ఒడిశా ప్రాంతం నుంచి అవసరమైన నల్లబెల్లాన్ని గుట్టుచప్పుడుగా ఆంధ్రకు తీసుకొస్తున్నారు. జోలాపుట్టు,ముంచంగిపుట్టు,కుమడ,బూసిపుట్టు,లక్ష్మీపురం గ్రామాల్లో నల్లబెల్లం నిల్వ చేసేందుకు ప్రత్యేక గోదాములు ఏర్పాటు చేశారు. ఆ గోదాముల నుంచే అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా సరిహద్దులో పండగలు, జాతర్లు జరుగుతుండడంతో సారాకు డిమాండ్ పెరిగింది. మారుమూల గ్రామాలతో పాటు మండల కేంద్రం ముంచంగిపుట్టులో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాల సమీపంలో సారా బట్టీలను సైతం ఏర్పాటు చేసి, భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. సారాను అరి కట్టేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్లు కృషి చేశారు. గ్రామాల్లో వెళ్లి అవగాహన కలిపించడం, సారా వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ లేక పోవడంతో ఎక్సైజ్ అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడంతో సారా తయారీ,అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.
‘సారా’సమైన ధరకే...
వారపు సంతల్లో ప్యాకెట్ రూ.10 చొప్పున్న విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే సారా ప్యాకెట్ దొరుకుతుండడంతో పూటగా సేవించి,మందు బాబులు ఎక్కడబడితే అక్కడ రోడ్ల మీద పడిపోవడంతో పాటు గొడవలు పడుతున్నారు. ఆ మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు బారిన పడుతున్నారు. రోజూ సారా మత్తులో గడుపుతుండడంతో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. ఆరోగ్యం క్షీణించి తమ వారు మరణించే ప్రమాదం ఉందని గిరిజన మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఎకై ్సజ్ అధికారులు,పోలీసులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని, సారా వల్ల ఇబ్బందులు పడుతున్న గృహిణులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఎకై ్సజ్ అధికారులు,పోలీసులు సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సరిహద్దు ప్రాంత వాసులు కోరుతున్నారు.
గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం
సారా వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. సారా అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సారా లేని గ్రామాలే లక్ష్యాంగా పనిచేస్తున్నాం. వారపు సంతల్లో, సారా అమ్ముతున్న గ్రామాల్లో దాడులు నిర్వహిస్తాం. సారా అమ్మకాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులోస్తే వెంటనే చర్యలు చేపడతాం.
– పి.నాని, ఎస్‌ఐ, ముంచంగిపుట్టు
నాటుసారా అమ్మకాలుఅరికట్టాలి
రాత్రీపగలు తేడా లేకుండా సారాను తాగుతూ గొడవలకు దిగుతున్నారు. ఎవరు చెప్పిన పట్టించుకోవడం లేదు. మత్తులో రోడ్లపై తూలుతూ ఎక్కడ పడితే అక్కడ పడి పోతున్నారు. అధికారులు స్పందించి సారా తయారీ, విక్రయాలను కట్టడి చేయాలి.
కె.త్రినాఽథ్, సీపీఎం మండల కార్యదర్శి,
ముంచంగిపుట్టు


