సెక్యూరిటీ గార్డు కుమార్తె జిల్లా టాపర్
సాక్షి, పాడేరు: పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఉమ్మడి అల్లూరి జిల్లా(పోలవరం కలిపి)లో నిరాశ పరిచాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. 2023, 2024 సంవత్సరాల్లో 61, 91 శాతాలుగా ఉత్తీర్ణత సాధించిన జిల్లా ఆ తరువాత నుంచి వరుసగా ఫలితాలు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. గతేడాది 2025లో 48 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా(అల్లూరి, పోలవరం కలిపి)లో మొత్తం 57.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒక్క అల్లూరి జిల్లాలో మాత్రం 46.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. గురువారం విద్యాశాఖ ఫలితాలను విడుదల చేయగా.. మొత్తమ్మీద ఈ ఏడాది ఉమ్మడి అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలో టెన్త్ ఫలితాల శాతం గత ఏడాది కన్నా పెరిగినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో మాత్రం చివరి స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో 11,394 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా.. 6508 మంది ఉత్తీర్ణులై 57.12 శాతం ఫలితాలు సాధించారు. వీరిలో బాలురు 2625, బాలికలు 3883 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే గత ఏడాది 47.61 శాతం ఫలితాలు సాధించగా.. ఈ ఏడాది 10 శాతం ఫలితాలు పెరిగాయి.
అల్లూరి జిల్లాలో 46.21 శాతం
జిల్లాలోని 11 మండలాల పరిధిలో అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించి 46.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల శాతం తక్కువగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ వర్గాల్లో కూడా ఆవేదన నెలకొంది. జిల్లాలోని 158 విద్యా సంస్థల పరిధిలో 7,221 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 3,355 మంది పాస్ అయ్యారు. 3,906 మంది ఫెయిలయ్యారు.
డివిజన్ల వారీగా ఫలితాలు
మొదటి డివిజన్‌లో 1507 మంది, రెండో డివిజన్‌లో 1165 మంది, 3వ డివిజన్‌లో 683 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యాలయాల వారీగా చూస్తే.. 9 గిరిజన గురుకుల పాఠశాలల్లో 721 మందికి 439 మంది, 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 455 మందికి 116 మంది, 11 కేజీబీవీల్లో 416 మందికి 254 మంది, 109 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 5101 మందికి 2192 మంది, 7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 302 మందికి 126 మంది, 10 ప్రైవేట్ పాఠశాలల్లో 266 మందికి 228 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు కన్నా ప్రైవేట్ పాఠశాలల్లో ఫలితాలు శాతం పెరిగింది. 10 ప్రైవేట్ పాఠశాలల్లో 85.71 శాతం ఫలితాలు రాగా, 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మాత్రం 25.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
నూరుశాతం ఫలితాలు సాధించిన గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాల సూపర్ 50 గిరిజన విద్యార్థినులు
శత శాతం ఫలితాలు సాధించిన దిగుమోదాపుట్టు ఆశ్రమ పాఠశాల
గిరిజన విద్యార్థులతో ఉపాధ్యాయులు
సాక్షి, పాడేరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లాలో టెన్త్ గిరిజన విద్యార్థులకు ప్రవేశ పెట్టిన సూపర్ 50 ప్రత్యేక బోధన పాఠఽశాలలు ఈ ఏడాది కూడా సత్తా చాటాయి. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో తెలివైన గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక బోధన కార్యక్రమాలు అమలు చేయడం సూపర్ 50 పాఠశాలల ఉద్దేశం. పాడేరు మండలంలోని గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలలో 25 మంది, దిగుమోదాపుట్టు ఆశ్రమ పాఠశాలలో 25 మంది గిరిజన విద్యార్థులు సూపర్ 50లో ప్రత్యేక బోధన పొంది ఈ ఏడాది కూడా నూరుశాతం ఫలితాలు సాధించారు. చింతపల్లి మండలానికి సంబంధించి చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో 17 మందికి 17 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. చింతపల్లి బాలురకు సంబంధించి 23 మందికి 20 మంది ఉత్తీర్ణులై 86 శాతం ఫలితాలు సాధించారు. వీరిలో ఉబ్బేటి దీపక్(583, దిగు మోదాపుట్టు), కొర్రా తేజశ్రీ(579, గుత్తులపుట్టు), ఎన్.చరణ్(526, చింతపల్లి బాలుర), కొర్రా దేవి(503,చింతపల్లి బాలికలు) ఉత్తమ మార్కులు సాధించారు. సూపర్ 50 పాఠశాలల్లో గత ఏడాది వలే ఉత్తమ ఫలితాలు రావడంతో గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమల, ఏటీడబ్ల్యూవోలు అఖిల, జయనాగలక్ష్మి, హెచ్‌ఎంలు సింహాచలం, రామన్నదొర ధర్మన్న, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
పదో తరగతిలో దారుణ ఫలితాలు వరుసగా రెండో ఏడాదీ అట్టడుగున
మండలాల వారీగా టెన్త్ ఫలితాలు
మండలం ఉత్తీర్ణత శాతం అరకులోయ 61.90 పాడేరు 57.34 అరకులోయ 54.87 ముంచంగిపుట్టు 54.43 అనంతగిరి 47.33 జి.కే.వీధి 45.04 హుకుంపేట 44.69 చింతపల్లి 41.02 జి.మాడుగుల 35.17 డుంబ్రిగుడ 34.23 కొయ్యూరు 24.44 మొత్తం 46.21
ఈ ఏడాది ఉమ్మడి అల్లూరి జిల్లాలో 57.12 శాతంతో రాష్ట్రంలో చివరి స్థానం
అల్లూరి జిల్లాలో కేవలం 46.21 శాతం ఫలితాలు
11,394 మందికి 6,508 మంది ఉత్తీర్ణత
పాసైన వారిలో బాలికలే అధికం
తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
కొయ్యూరు: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్టు డీఈవో రామకృష్ణ తెలిపారు. మండలాల వారీగా లేదా రెండు, మూడు మండలాలకు కలిపి ఒకచోట తరగతులు ఏర్పాటు చేస్తామని, పూర్తి వివరాలు ఒకటి, రెండు రోజుల్లో వెల్లడిస్తామన్నారు. మే చివరిలో జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీరత సాధించేందుకు వీలుగా విద్యార్థులను సిద్ధం చేస్తామన్నారు.
ముంచంగిపుట్టు: ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జోలాపుట్టు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని దేవి 593/600 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఒనకఢిల్లీ గ్రామానికి చెందిన దేవి తండ్రి శ్రీనివాస్ మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి లావణ్య ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. దేవి ఒనకఢిల్లీలోని డీఏవీ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుకుంది. 9వ తరగతిలో జోలాపుట్టు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేరి 10వ తరగతి వరకు చదువుకుంది. పది ఫలితాల్లో దేవి జిల్లా టాపర్‌గా నిలిచి అత్యధిక మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుమార్తె దేవికి స్వీటు తినిపించి సంతోషం పంచుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాల ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ చదివి మంచి మార్కులు సాధించానని దేవి తెలిపారు. శాస్త్రవేత్త కావడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. దేవికి పాఠశాల హెచ్‌ఎం త్రినాథరావు, ఎంఈవో కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు ఫోన్‌లో అభినందనలు తెలిపారు.


