చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈ నెల 1 నుంచి 5 వరకూ అల్లూరి జిల్లా పరిధిలో వాతావరణ వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో వర్ష పాతం 5 నుంచి 8 మిల్లీ మీటర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 30.3 డిగ్రీల నుంచి 34.3 డిగ్రీల మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 20.6 నుంచి 22 డిగ్రీల మధ్య ఉండవచ్చునన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 72 నుంచి 80 శాతం, మధ్యాహ్న సమయాల్లో 42 నుంచి 70 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు 10 నుంచి 18 కిలో మీటర్లు వేగంతో వీచే సూచనలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు.


