అరకులోయ టౌన్(డుంబ్రిగుడ): గిరిజన గ్రామాల్లో గతేడాది శంకుస్థాపన చేసిన రోడ్ల పనులను తక్షణం పూర్తి చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్ల పనులను మధ్యలోనే వదిలేశారన్నారు. ప్రస్తుతం అనేక గ్రామాల్లో రోడ్డు సదుపాయం లేక అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాపాయస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులను ఆస్పత్రులకు తరలించడానికి డోలీల మోత తప్పడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ గిరిజన గ్రామాలను అనుసంధానం చేసేందుకు అడవితల్లి బాట పేరుతో రోడ్డుకు గతేడాది శంకుస్ధాపన చేసినప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఈ దయనీయ పరిస్థితులకు పూర్తిగా ప్రభుత్వం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బకాయి బిల్లులను చెల్లించి నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.


