ప్రాణం తీసిన నిర్లక్ష్యం
అచ్యుతాపురం రూరల్ : డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వ్యాన్ అదుపు తప్పి ఒక వలస కార్మికుడు మృతి చెందిన దుర్ఘటన ఆదివారం జరగగా, మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం 5.56 గంటలకు సెజ్‌లో గల ఏ.ఆర్ లైఫ్‌సైన్స్ పరిశ్రమకు కార్మికులను తీసుకువెళ్లే వాహనం పూడిమడక రోడ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్దకు వచ్చేసరికి వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి బోల్తా పడింది. అప్పటికి లగేజ్‌వ్యాన్‌లో ఉన్న 14 మంది రహదారిపై పడిపోవడంతో తీవ్రంగా గాయాలపాలయ్యారు. వారిలో ఒకరు ఝార్ఖండ్‌కు చెందిన రాబిన్ మరండీ (46) అనకాపల్లి ఉషా ప్రైమ్‌లో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన కార్మికులు నెమ్మదిగా కోలుకుంటున్నారని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


