ఆటో ఢీకొని తోటమాలి మృతి
కశింకోట : కశింకోట వద్ద జాతీయ రహదారిపై ఆటో ఢీకొని తోటమాలి మృతి చెందాడు. ఎస్‌ఐ కె. లక్ష్మణరావు మంగళవారం అందించిన వివరాల ప్రకారం స్థానిక హౌసింగ్ కాలనీకి చెందిన గొలగాని దేవుడు (54) ఇక్కడి సరోజిని విల్లాలో తోటమాలిగా పని చేస్తున్నాడు. విధులు ముగించుకొని సోమవారం సాయంత్రం తన ఇంటికి వెళుతూ జాతీయ రహదారి దాటుతుండగా అనకాపల్లి నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న ఆటో బలంగా ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడడంతో అతనిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికుల సహాయంతో తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం దేవుడు మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


