సంక్రాంతికి 1,007 ప్రత్యేక బస్సులు
డాబాగార్డెన్స్: సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ విశాఖ నుంచి భారీగా ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు విశాఖలోని వివిధ డిపోల నుంచి మొత్తం 1,007 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నం, సింహాచలం, మద్దిలపాలెం, మధురవాడ, గాజువాక, విశాఖ స్టీల్, వాల్తేర్ డిపోల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళానికి అత్యధికంగా 238, విజయవాడకు 215 సర్వీసులను కేటాయించారు. మిగిలిన వాటిలో పార్వతీపురానికి 101, రాజమండ్రికి 86, పలాసకు 85, పాలకొండకు 65, విజయనగరానికి 58, ఇచ్ఛాపురానికి 48, రాజాంనకు 34, సాలూరుకు 28, కాకినాడకు 18, బొబ్బిలికి 10, అమలాపురానికి 10, భీమవరానికి 5, నర్సీపట్నానికి 4, పాడేరుకు 2 చొప్పున బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.


