ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
● పీవో తిరుమణి శ్రీపూజను కోరిన ఎమ్మెల్యే మత్స్యలింగం
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో మాట్లాడుతున్న అరకు ఎమ్మెల్యే మత్య్సలింగం
పాడేరు : జిల్లాలోని అరకు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిలో సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం కోరారు. మంగళవారం ఆయన ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావును వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. అరకు నియోజకవర్గం మీదుగా వెళ్లే 516–ఈ మార్గంలో కొత్తభల్లుగూడ నుంచి హుకుంపేట మండలం పాటిమామిడి వరకు అనేక భద్రత సమస్యలు ఉన్నాయన్నారు. సరైన అప్రోచ్ రోడ్లు, కల్వర్టులు, వీధి ధీపాలు, హెచ్చరిక బోర్డులు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్‌హెచ్–516ఈ అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాల జారీ చేస్తామని ఈ సందర్భంగా పీవో హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.


