భూసిపుట్టు వారపు సంతలో మోసాలు
భూసిపుట్టు వారపు సంతలో అవగాహన కల్పిస్తున్న లోహితాసుడు
ముంచంగిపుట్టు: భూసిపుట్టు వారపు సంతలో మోసాలకు పాల్పడటమే కాకుండా నకిలీ వస్తువుల అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్సీ,ఎస్టీ జిల్లా కమిటీ సభ్యుడు చెండా లోహితాసుడు ఆరోపించారు. మంగళవారం ఆయన భూసిపుట్టు వారపు సంతలో అమ్మకాలను పరిశీలించారు. తూనికల్లో మోసాలకు పాల్పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని వ్యాపారులను హెచ్చరించారు. గిరిజనులకు వినియోగదారుల హక్కులు, నకిలీ, కల్తీ వసువులు గుర్తించడంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వారపు సంతల్లో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కాలం చెల్లిన వస్తువులు, కల్తీ నూనె, కారం, సబ్బులు తదితర సరకులు విక్రయిస్తున్నారన్నారు. తూనికలు కొలతలు శాఖ అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


