వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఆందోళన
అనకాపల్లి: వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్‌షిప్(ఇస్కాఫ్) సభ్యులు ఆందోళన చేశారు. స్థానిక మెయిన్ రోడ్డులోని సీపీఐ కార్యాలయం వద్ద ఇస్కాఫ్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించి, అనంతరం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఇస్కాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు మాట్లాడుతూ అక్రమంగా అమెరికా జైలులో నిర్బంధించిన వెనిజువెలా అధ్యక్షుడు మధురోను, అతని భార్య సిలియా ఫ్లోరైస్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ, ఐక్యరాజ్య సమితి ప్రమేయం లేకుండా అమెరికా నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. భారత ప్రభుత్వం కూడా అమెరికా నియంతృత్వ పోకడలను ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్కాఫ్ నాయకులు దాడి శివరామ, బుద్ధ వీరు నాయుడు, బొడ్డేడ అప్పారావు, మొల్లి రమణబాబు, దొరబాబు, భద్రం, వెంకటేశ్వరరావు, మల్ల చక్రవర్తి, రామచంద్రరావు, బొండా సాయి, దక్షిణామూర్తి, రాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


