వసతి గృహంలో సమస్యల వెల్లువ
అచ్యుతాపురం రూరల్ : ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్‌రెడ్డి ఆకస్మిక పర్యటన అనంతరం మోసయ్యపేట బాలుర వసతి గృహంలో పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులు అనే సమస్యలతో సతమతమవుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకూ 180 మంది విద్యార్థులు ఈ హాస్టల్‌లో ఉంటూ స్థానిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వారంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదు. హాస్టల్ చుట్టు పక్కల ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. పౌష్టికాహారం అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎవరైనా విద్యార్థులు హాస్టల్‌లో నాణ్యత లోపాలపై ప్రశ్నిస్తే వార్డెన్ కర్కశంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్‌పై గతంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడానికి ప్రత్యేకంగా వర్కర్లు లేకపోవడంతో వంట పని చేసే వారే రెండు పనులూ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం విద్యార్థి చేపల అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతూ స్కూల్ నుంచి హాస్టల్ వచ్చేశాడు. ఇలా తరచూ విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్‌లో వసతుల మెరుగుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


