ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి మృతి
దేవరాపల్లి: చదవట్లేదని తండ్రి మందలించడాన్న కారణంతో గడ్డి మందు తాగిన ఓ డిగ్రీ విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తెనుగుపూడి గ్రామానికి చెందిన సేనాపతి ఆనంద్(18) విశాఖపట్నంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇటీవల చదువుపై శ్రద్ధ కనబరచకపోవడంతో తండ్రి సింహాచలం మందలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. కొంత సమయం తర్వాత ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే దేవరాపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆనంద్ మృతదేహాన్ని గ్రామంలోని యువకులంతా కాశీపురం నుంచి తెనుగుపూడి వరకు అశ్రునయనాల మధ్య తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.


