ఆంజనేయ వాహనంపై ఆపద్బాంధవుడు
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆంజనేయవాహనం పై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం మూలవిరాట్‌కు నిత్యార్చనలు,పూజలు పూర్తిచేశారు. కొండదిగువన ఉత్సవ మూర్తులకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం పూర్తిచేసిన తరువాత శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆంజనేయవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధిసేవలు నిర్వహించారు.అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 22వపాశురాన్ని విన్నపం చేశారు. తదుపరి ప్రసాద నివేదన, తీర్థగోష్టి ప్రసాదవినియోగం జరిగాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రితిరువీధి సేవలు నిర్వహించారు.అధ్యాపక స్వామి ద్రవిడ వేద ప్రబంధ విన్నపం చేశారు. ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.


