కోతి దాడిలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
రావికమతం: మండల కేంద్రం రావికమతంలో కోతుల దాడులతో విద్యార్థులు వణికిపోతున్నారు. గత నెలలో ఒకసారి హాస్టల్ విద్యార్థులపై, మరో సారి ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం నవోదయ విద్యార్థినులపై కోతి దాడి చేయడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. మంగళవారం గెంజి వారి రామాలయా నికి సమీపంలో నవోదయ పాఠశాలలోకి కోతి ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులపై దాడి చేసింది. ఈ దాడిలో రావికమతంకు చెందిన ఎస్.లోహిత, గు మ్మాళ్లపాడుకు చెందిన బుర్రకాయుల లీనా గాయపడ్టారు. వారిని పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలని నవోదయ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ పట్నాయక్ కోరారు.


