యాదవుల ఐక్యతను చాటి చెబుదాం
● స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం దక్కేలా కృషి చేద్దాం
● యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడుబర్నికాన బాబూరావు
దేవరాపల్లి: యాదవులకు నామినేటెడ్ పోస్టులతో పాటు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో సైతం సముచిత స్థానం దక్కేలా ఐక్యంగా కృషి చేద్దామని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు పిలుపునిచ్చారు. మండలంలోని రైవాడ ఎరకాలమ్మ ఆలయ ప్రాంగణంలో దేవరాపల్లి మండల యాదవ సంఘం ఆత్మీయ సమావేశం మండల అధ్యక్షుడు కోన ఈశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅథితిగా హాజరైన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు మాట్లాడుతూ జిల్లాలోని యాదవులంతా ఐక్యంగా కలిసి పనిచేయడం ద్వారానే హక్కుల సాధన సాధ్యపడుతుందన్నారు. యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పిల్లల విద్యకు ఆర్థిక స్థోమత అవరోధమైతే సంఘం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. విద్యలో రాణించే యాదవ విద్యార్థులకు ఏటా రూ. 8 లక్షల విలువ చేసే స్కాలర్‌షిప్‌లు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. మాడుగుల నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడు మొల్లి సన్నిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో 30వేలకు పైబడి యాదవ సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ప్రాధన్యత దక్కలేదన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం లభించేలా యాదవుల ఐక్యతను చాటి చెబుదామని చెప్పారు. యాదవులను బీసీ–ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి బాబూరావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తీర్మానిస్తామని పలువురు నాయకులు తెలిపారు. యాదవ సంఘం క్యాలెండర్‌ను జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు, నియోజకవర్గ అధ్యక్షుడు మొల్లి సన్నిబాబు తదితరుల చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కిల్లాన శ్రీనివాసరావు, కాణిపాకం వినాయక దేవస్థానం బోర్డు డైరెక్టర్ చల్లా కృష్ణవేణి నానాజీ, స్థానిక సర్పంచ్ చల్లా లక్ష్మీ నాయుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దాలిబోయిన రామగోవింద, డైరెక్టర్ బంధం అప్పలరాజు, నమ్మి బాలరాజు, కోన నాగేశ్వరరావు తదితర యాదవ సంఘం నాయుకులు పాల్గొన్నారు.


