104 ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ
అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యాన్ని చేరవేస్తున్న 104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం అన్యాయం చేస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నెహ్రూచౌక్ వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 104 వాహన ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 104 నిర్వహణ చేపడుతున్న భవ్య యాజమాన్యానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితిలో 104 ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 104లో విధులు నిర్వహిస్తూ 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,500 వేతనం అమలు చేయాలని ఆయన కోరారు. క్యాజువల్ లీవ్‌లు పునరుద్ధరించాలని, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్, కాళ్ల తాళయ్యబాబు, 104 ఉద్యోగుల సంఘం కోశాధికారి జి.చంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీరంరెడ్డి భార్గవ్, ఉద్యోగులు జి.చంద్రుడు, భార్గవ్, చిరంజీవి, ఎం.మూర్తి, రమణ ఎం.ప్రశాంత్, కుమార్, ఎ.మధు, సతీష్, వై.వి.నాయుడు, ఎం.శ్రీను, ఎం.ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.


