అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దు
సొంతింటి కలను నెరవేర్చండి
తమకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని కూడా నిబంధనల పేరుతో నాయకులు అడ్డుకుంటున్నారని చోడవరం మండలం అంబేరుపురం గ్రామానికి చెందిన పందిరి లక్ష్మణరావు భార్య పిల్లలతో కలిసి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. తన భార్య పేరుకు బదులు తన పేరు జాబితాలో రావడంతో నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని తన సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
తుమ్మపాల: అర్జీలపై నిర్లక్ష్యం వహించవద్దని, భూసమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం 1, 2లో వేర్వేరుగా నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎస్‌డీసీలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీల పరిష్కారం అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిల్లోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. పీజీఆర్‌ఎస్‌లో 155, రెవెన్యూ క్లినిక్‌లో 259 అర్జీలు కలిపి మొత్తం 414 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.సుబ్బలక్ష్మి, మనోరమ, రమామణి, అనిత, సీపీవో జి.రామారావు, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ పథక సంచాలకులు పూర్ణిమ దేవి, కె.సరోజినీ, శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడు గోపాల్‌రాజా పాల్గొన్నారు.
అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దు


