కబ్జాదారులపై చర్యలకు వెనుకడుగు?
మాకవరపాలెం : ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలకు రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. అధికార టీడీపీకి చెందిన నాయకులు కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని రామన్నపాలెం శివారు చినరాచపల్లి వద్ద 737 సర్వే నంబర్ పరిధిలో ఊటగెడ్డ రిజర్వాయర్‌కు ఆనుకుని ఫారెస్ట్, రెవెన్యూ, ఇరిగేషన్ ఆధీనంలో భూములు ఉన్నాయి. వీటిలో సుమారు 20 ఎకరాలను గతంలో టీడీపీ నాయకులు ఆక్రమించడంతో 2018లోనే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే గత నెల 24న హెచ్చరిక బోర్డు ఉండగానే ట్రాక్టర్‌తో దుక్కులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న ఆర్‌ఐ చక్రపాణి, వీఆర్వో సాంబశివరావు ఈ భూమిని పరిశీలించి ఆక్రమణలు అడ్డుకున్నారు. అనంతరం నివేదికను తహసీల్దార్ వెంకటరమణకు అందజేశారు. దీంతో ఈ భూమి ఆక్రమణకు సంబంధించి టీడీపీ నాయకులు రామన్నపాలెం మాజీ సర్పంచ్ చుక్కా పోతురాజు, అడిగర్ల శ్రీనివాసరావులపై కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. దుక్కులు చేస్తున్న ట్రాక్టర్, ఒక బైక్‌ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించినట్టు తహసీల్దార్ చెప్పిన విషయం పత్రికల్లో సైతం వచ్చింది. ఇదంతా జరిగి 13 రోజులు కావస్తున్నా ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాలేదు.
స్పీకర్ ఆదేశాలు బేఖాతరు
భూకబ్జాలకు పాల్పడేవారిపై పార్టీలతో సంబంధం లేకుండా వెంటనే కేసులు పెట్టాలని స్వయంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మూడు రోజుల క్రితం నర్సీపట్నం మార్కెట్ యార్డ్‌లో జరిగిన ఓ సమావేశంలో అధికారులను ఆదేశించారు. టీడీపీ వారైనా సరే వెనుకడుగు వేయకుండా కేసులు పెట్టాలని నర్సీపట్నం ఆర్డీవో, మిగిలిన మండలాల తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. కానీ మాకవరపాలెం మండలంలో అధికారులు కబ్జాదారులపై చర్యలకు వెనుకడుగు వేస్తుండటంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
కబ్జాదారులపై చర్యలకు వెనుకడుగు?


