గోవాడ రైతుల అర్ధనగ్న ప్రదర్శన
చోడవరం : ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధుల అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీ మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన రిలే దీక్ష శిబిరం సోమవారం 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం, సీపీఐ, రైతు కూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నాయకులు ఈ శిబిరంలో పాల్గొని అర్ధ నగ్నంగా నిరసన తెలిపారు. చెరకు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరించారు.
ఫ్యాక్టరీని కాపాడతామని, చెరకు రైతులకు అండగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ పూర్తిగా మోసం చేశారని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయంగా తీసురాలేకపోయారని వారు ధ్వజమెత్తారు. రైతులను మోసం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, సీపీఎం జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ ప్రతినిధి శానాపతి సత్యారావు, సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, జిల్లా వ్యవసాయ కూలీ సంఘం అధ్యక్షుడు కోన మోహన్‌రావు, సీఐటీయూ నాయకుడు ఎస్వీనాయుడు, తదితరులు పాల్గొన్నారు.


