అధిక ధరకు ఎరువుల విక్రయం
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో లక్ష్మీ ట్రేడర్స్ ఎరువుల దుకాణం లైసెన్స్‌ను 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి తెలిపారు. మండలంలోని తాళ్లపాలెంలో లక్ష్మీ ట్రేడర్స్ ప్రైవేటు ఎరువుల దుకాణాన్ని సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 1985 ఎరువుల చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించామని ఆశాదేవి తెలిపారు. బిల్లు బుక్‌ను తనిఖీ చేసి, దాంట్లో ఉన్న సెల్‌ఫోన్ నంబర్లకు ఫోన్ చేశామన్నారు. యూరియా ఎరువు బస్తా రూ.266.50కు బదులు రూ.400 నుంచి రూ.410 వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డీఏపీ ఎరువు కూడా అధిక ధరలకు అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. కొన్ని సెల్ నెంబర్లకు కాల్ చేయగా అవి అందుబాటులో లేనట్లు, కొన్ని తప్పుగా నమోదు చేసినట్లు రుజువైందన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సహాయ సంచాలకురాలు ఎం.ఎస్.వసంత కుమారి, అనకాపల్లి సహాయ సంచాలకుడు సిహెచ్.సుబ్రహ్మణ్యం, వ్యవసాయ అధికారి ఎం.స్వప్న, జిల్లా టెక్నికల్ అధికారి ఎన్.సరోజిని పాల్గొన్నారు.


