సండే..రన్‌డే
సాగరతీరంలో ఉత్సాహంగా నేవీ మారథాన్ తరలివచ్చిన వేలాది మంది ఔత్సాహికులు, క్రీడాకారులు
రన్‌లో పాల్గొన్న ఔత్సాహికులు
విశాఖ స్పోర్ట్స్ : విశాఖ సాగర తీరం పరుగు వీరులతో కిక్కిరిసిపోయింది. భారత నావికాదళం ఆధ్వర్యంలో పదోసారి నిర్వహించిన వైజాగ్ నేవీ మారథాన్‌కు వయోబేధం లేకుండా ఔత్సాహికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లేలేత సూర్య కిరణాలు శరీరానికి వేడితో పాటు ఉత్తేజాన్నిస్తుండగా, దాదాపు పదిహేడు వేల మంది ఈ పరుగులో భాగస్వామ్యం అయ్యారు. ఈ మారథాన్‌లో కొందరు విదేశీ అథ్లెట్లు సైతం పాల్గొని పతకాలను సొంతం చేసుకున్నారు.నేవీ డే వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఈ పరుగును ఫిట్‌నెస్, సముద్ర ఆహ్లాద వాతావరణంపై అవగాహనతో పాటు నేవీ డే స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించారు. విదేశీ అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ముఖ్యంగా ఇథియోపియాకు చెందిన పరుగు వీరులు విజేతలుగా నిలిచారు. విశాఖలోని ఐకానిక్ ఆర్కే బీచ్ వెంబడి ఉన్న విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి నాలుగు ప్రధాన కేటగిరీల్లో పరుగు సాగింది. రన్‌లో పాల్గొన్నవారికి రిఫ్రెషింగ్, 12 హైడ్రేషన్ పాయింట్లతో పాటు వైద్యసౌకర్యాలు కల్పించారు. ఆరేకే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై విజేతలకు పతకాలతో పాటు నగదు ప్రోత్సాహాకాల్ని అందించారు. ఉదయం నుంచి యువతీయుకులు డ్యాన్స్‌లు చేస్తూ ఉర్రూతలూగించారు. 42 కిలోమీటర్ల రన్‌ను తూర్పు నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించగా..21 కిలోమీటర్ల రన్‌ను నౌకాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సతీమణి ప్రియభల్లా ప్రారంభించారు..నేవీ అధికారులు, వారి కుటుంబసభ్యులతో పాటు కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు.
పరుగు సాగిందిలా...
42కిలోమీటర్ల ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ మారథాన్ ఉదయం 4.15 గంటలకే ప్రారంభమైంది. ఇది ఐఎన్‌ఎస్ కళింగ వద్ద యూ టర్న్ తీసుకుని తిరిగి ప్రారంభ వేదిక వద్దకు చేరుకోవడంతో ముగిసింది.
21 కిలోమీటర్ల సబ్‌మైరెన్ హాఫ్ మారథాన్ ఉదయం 4.30 గంటలకు మొదలై, గాయత్రి కళాశాల వద్ద యూటర్న్ తీసుకుంది.
10 కిలోమీటర్ల ఎయిర్‌క్రాఫ్ట్ రన్ ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై, తెన్నేటి పార్క్ వద్ద యూటర్న్ తీసుకుంది.
5 కిలోమీటర్ల ఫ్రిగేట్ పరుగు (సరదా పరుగు) ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. చిన్నారులు సైతం హుషారుగా పాల్గొన్నారు. ఇది కురుసురా సబ్‌మైరెన్ మ్యూజియం మీదుగా వైఎస్సార్ విగ్రహం చెంత యూటర్న్ తీసుకుని ముగిసింది.
సండే..రన్‌డే
సండే..రన్‌డే
సండే..రన్‌డే


