కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సీహెచ్ నరసింగరావు
డాబాగార్డెన్స్: సీఐటీయూ 28వ ఆలిండియా మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు తొలిసారిగా విశాఖలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జనవరి 4న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నిర్వహించే మహా ప్రదర్శనకు కార్మిక కుటుంబాలను పెద్ద సంఖ్యలో తరలించాలని సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభల విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే ‘శ్రామిక ఉత్సవాల’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. సోమవారం వాడవాడలా జెండాలు ఎగురవేసి, ఫ్యాక్టరీల వద్ద, కార్మికుల కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని ఆయన సూచించారు. స్టీల్‌ప్లాంట్‌తో సహా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమాలను, లేబర్ కోడ్స్ వల్ల కలిగే ప్రమాదాన్ని కార్మికులకు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు కె.లోకనాథం, ఎం.జగ్గునాయుడు, ఆర్‌కేఎస్‌వీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన సంఘాల నాయకులు కూడా హాజరై మహాసభల ఏర్పాట్ల గురించి వివరించారు.


