ఎన్‌కౌంటర్లపై విచారణకు వెళ్లకుండా అడ్డుకున్నారు
హైకోర్టు న్యాయవాది సురేష్‌కుమార్
రంపచోడవరం: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లపై నిర్వహించిన మేజిస్ట్రీరియల్ విచారణకు వెళ్లకుండా పోలీసులు తుపాకులతో అడ్డుకున్నారని హైకోర్టు అడ్వకేట్ సురేష్‌కుమార్ ఆరోపించారు. హిడ్మాతో పాటు మిగిలిన మావోయిస్టులు, పోలీసులు మధ్య జరిగిన ఎదురుకాల్పులపై రంపచోడవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్ సోమవారం విచారణ జరిపారు. విచారణలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన తనను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని సురేష్‌కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. లాయర్ల సంఘం తరఫున విచారణకు హాజరయ్యేందుకు తాను వచ్చినట్టు తెలిపారు. లోపల మీటింగ్ జరుగుతోందని, సీఐ ఎవరినీ పంపవద్దన్నారని పోలీసుల తెలిపారన్నారు. గట్టిగా ప్రశ్నిస్తే సబ్‌కలెక్టర్ లోపలికి పిలిపించారని చెప్పారు. సంఘటనా స్థలానికి వెళ్లేందుకు తమకు అనుమతించడంలేదని, హైదరాబాద్ నుంచి విద్యార్థి సంఘాల నాయకులు వస్తే వారిని అడ్డుకున్నారని సబ్‌కలెక్టర్‌కు చెప్పినట్టు ఆయన తెలిపారు. ప్రజా సంఘాల తరఫున కుంజా దూలయ్య సంఘటన స్థలానికి వెళ్లి వస్తే ఆయనపై కేసు పెట్టారన్నారు. ఏ నిజాన్ని ఆపడం కోసం అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. విచారణ సమయంలో పోలీసుల వద్ద తుపాకులు ఉండకూడదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ జరిగితే ఎవరైనా వచ్చి తమకు తెలిసింది చెప్పగలుగుతారని తెలిపారు. తూతూ మంత్రంగా విచారణ జరిగిందన్నారు. తమ వాదన విన్న సబ్ కలెక్టర్ పది రోజుల తరువాత మళ్లీ విచారణ జరుగుతుందని చెప్పారన్నారు. అనంతరం వాయిదా వేసినట్లు తెలిపారు. సబ్‌కలెక్టర్‌పై నమ్మకంతో ఉన్నామన్నారు.మీడియాకు ప్రవేశం లేకుండా విచారణ చేయడం దారుణమని తెలిపారు. విచారణ హాల్‌లో వంద మంది వరకు ఉన్నారని, అనుకూలంగా ఉన్న వారికి ముందుగా పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలో వివరించి, విచారణకు పంపించారన్నారు. వారికి అనుకూలంగా ఉన్న స్టేట్‌మెంట్లను మాత్రమే రికార్డు చేసుకుంటున్నారని తెలిపారు.


