ఆస్పత్రికి వెళ్లేందుకు మాకు మేమే తోడు
ముంచంగిపుట్టు: స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1లో విద్యార్థినులు అనారోగ్యానికి గురైతే పడరాని పాట్లు పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థినులను తోటి విద్యార్థినులే స్థానిక సీహెచ్‌సీకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లు లేకపోవడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సోమవారం ఉదయం కొంత మంది విద్యార్థినులు జ్వరం,దగ్గు,జల్బులతో బాధపడుతూ ఉండడంతో తోటి విద్యార్థినుల సాయంతో ఆస్పత్రికి తరలించారు.జ్వరంతో బాధపడుతున్న 5వ తరగతి విద్యార్థిని సబితా నడవడానికి ఇబ్బంది పడుతుండడంతో తోటి విద్యార్థినులు రెండు వైపులా పట్టుకుని అతికష్టం మీద ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వర్కర్లు లేకపోవడంతో విద్యార్థులకు అనారోగ్యానికి గురైతే వార్డెన్లు, ఉపాధ్యాయులపైనే భారం పడుతోంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే అనారోగ్యానికి గురైన వారి బాగోగులు చూసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు,గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు.


