సిగినాపల్లి క్వారీలో గుట్టుగా రంగురాళ్ల తవ్వకాలు?
గూడెంకొత్తవీధి: పెదవలస అటవీ రేంజ్ పరిధిలోని సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో ఆదివారం అర్ధరాత్రి గుట్టుగా రంగురాళ్ల తవ్వకాలు జరిగినట్టు తెలిసింది. ఈవిషయాన్ని క్వారీ పరిసర గ్రామాలకు చెందిన గిరిజనులే గుర్తించారు. క్వారీలో బేస్‌క్యాంపులో కాపలాగా ఉన్న అటవీ సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమ తవ్వకాలు జరిగినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో రూ.కోటి వ్యాపారం జరిగినట్టు సమాచారం.కొందరు గ్రామస్తులు ఆదివారం రాత్రి క్వారీ ప్రదేశానికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ క్వారీలో తవ్వకాలు జరిగినట్టు ఆనవాళ్లు ఉండడంతో కాపలాగా ఉన్న అటవీ సిబ్బందిని గ్రామస్తులు నిలదీశారు. సిగినాపల్లి క్వారీలో విలువైనఅలెక్స్ రకానికి చెందిన రంగురాళ్లు లభిస్తున్నాయన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఈనేపథ్యంలోనే అప్పుడప్పుడు ఈక్వారీలో రంగురాళ్లకోసం అన్వేషణ సాగుతోంది. చింతపల్లి, నర్సీపట్నానికి చెందిన రంగురాళ్ల వ్యాపారులు కొందరు గిరిజనులకు కాసుల ఎర చూపించి తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల అదే క్వారీలో తవ్వకాలు జరిగాయి. దీంతో పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడ క్వారీని తాత్కాలికంగా మూసివేశారు. క్వారీలో నిరంతరం కాపలా కాసేందుకు సిబ్బందిని ఉంచుతున్నారు. వీరు విడతలవారీగా క్వారీలో కాపలాగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి క్వారీలో కాపలాగా కేవలం ఇద్దరు సిబ్బందే ఉన్నారు.
ఈవిషయాన్ని గుర్తించిన వ్యాపారులు అటవీ సిబ్బందిని ప్రలోభపెట్టి కొందరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన గిరిజనులతో క్వారీలో తవ్వకాలకు పాల్పడినట్టు అక్కడ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయంపై స్థానిక యువత అక్కడ అటవీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రంగురాళ్ల క్వారీకి కాపలాగా ఉండి అటవీ సంపదను కాపాడాల్సిన సిబ్బందే వ్యాపారులతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈవిషయం గూడెంకొత్తవీధి పోలీసులకు చేరింది. దీంతో క్వారీలో కాపలాగా ఉంటున్న అటవీ సిబ్బందితోపాటు నిలదీసిన గిరిజనులను స్టేషన్‌కు పిలిపించి సమగ్రంగా విచారిస్తున్నట్టు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.


