అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.
వైభవంగా నిత్యకల్యాణం
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.
శాస్త్రోక్తంగా గరుడసేవ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. గరుడవాహనం చుట్టూ భక్తులను ప్రదక్షిణ చేయించారు.
అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనం కోసం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో సింహాచలం తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో దర్శన క్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, అన్నప్రసాద భవనం అన్నీ కిటకిటలాడాయి. దేవస్థానానికి సుమారు రూ.32 లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు


