విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జి.మాడుగుల: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ హెచ్చరించారు. మంగళవారం ఆయన స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. అటెండెన్స్, మూమెంట్ రిజస్టర్లను ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. కాన్పునకు సిద్ధంగా ఉన్న గర్భిణులను వారం రోజుల ముందుగా స్థానిక బర్త్ వెయిటింట్ హోమ్‌కు తరిలించి సుఖప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఇళ్ల వద్ద కాన్పులు జరిగితే సంబంధిత క్షేత్రస్థాయి, పర్యవేక్షిక సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో అన్ని వార్డులు, ప్రసూతి గదిని ఆయన పరిశీలించారు. శీతాకాలంలో న్యుమోనియా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెంచే అవకాశం ఉందన్నారు. అందువల్ల పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున వారిలో వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. గ్రామాలు, పాఠశాలల్లో జ్వరాలు, వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు అదుపునకు వైద్యాధికారులు,సిబ్బంది కలసి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు.


