స్క్రబ్ టైఫస్ కలకలం
చింతూరు: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపింది. తొలి పాజిటివ్ కేసు చింతూరు మండలంలో నమోదు కావడంతో మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇది సాధారణ జ్వరం లాంటిదైనప్పటికీ ఆలస్యం చేస్తే శరీరంలో అంతర్గ అవయవాలపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
చింతూరు మండలం కొత్తపల్లికి చెందిన మడివి లక్ష్మయ్య అనే గిరిజనుడు ఈనెల నాల్గో తేదీన వ్యాధి లక్షణాలతో చింతూరు ప్రభుత్వ ఆస్పత్రికి రాగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి బ్యాక్టీరియా సోకినట్లు నిర్థారించారు. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన అతని నుంచి రక్తం సేక రించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి సోమ వారం తెలిపారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.
జిల్లాలో కొండలపై, అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తుంటారు. ప్రస్తుతం వ్యాధిసోకిన లక్ష్మయ్య గ్రామం కొత్తపల్లి కూడా అటవీ ప్రాంతంలోనే ఉంది. వరికోతలు జరుగుతుండడంతో ఈ సమయంలోనే లక్ష్మయ్యకు నల్లికుట్టి వ్యాధిసోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ లక్షణాలు
● స్క్రబ్ టైఫస్ అనే నల్లి(మైట్) కుట్టినప్పుడు బ్యాక్టీరియా సోకుతుంది.
● నల్లి కరిచిన ప్రాంతంలో నల్లటిమచ్చ ఏర్పడి నొప్పిలేకుండా ఉంటుంది.
● స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్ర జ్వరంతో పాటు తలనొప్పి, చలితో మొదలవుతుంది.
● కండరాల నొప్పులు, లింపు గ్రంథలు వాపు ఉంటాయి.
● కొందరికి కళ్లు ఎర్రబడతాయి.
● దగ్గు కూడా ఉంటుంది.
● కొంతమంది శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి
● రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి,
వృద్ధులకు ఈ వ్యాధి లక్షణాలు ఎక్కవగా కనిపిస్తాయి.
● స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించిన మూడు రోజుల్లో రక్తపరీక్షలు చేయిచుకోవాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాలేయంపై ప్రభావం చూపుతుంది.
● తర్వాత కిడ్నీ దెబ్బతిని డయాలసిస్‌కు
దారితీయోచ్చు
● సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతుంది.
సత్వర వైద్యం అవసరం
స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి నల్లికాటు వల్ల వస్తుంది. తీవ్రజ్వరం, నొప్పులు, శ్యాశ తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వస్తే నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తాం. ఈ వ్యాధికి సత్వర వైద్యం ఎంతో అవసరం. ఇది అంటువ్యాధి కానందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు వ్యాధికి సంబంధించిన నిర్థారణ కిట్లు, మందులు అస్పత్రిలో అందుబాటులో ఉంచాం. డివిజన్‌లో ఎవరికై నా వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానంగా ఉంటే వెంటనే చింతూరు సీహెచ్‌సీకి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి.
–డాక్టర్ కోటిరెడ్డి, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, చింతూరు
స్క్రబ్ టైఫస్ కలకలం


