కాఫీకి స్థిరమైన గిట్టుబాటు ధరలు
పాడేరు: అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కాఫీ పంటకు స్థిరమైన ధర లభించేలా పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. కాఫీ రైతులు, వ్యాపారులు, ఎఫ్‌పీవోలు, ఎన్జీవోలతో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన, చర్చా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో కాఫీ ట్రేడర్లు... ట్రేడర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే దానికి చట్టబద్ధత కల్పించి, ఆ అసోసియేషన్ ద్వారానే వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. కాఫీకి స్థిరమైన ధరలు కల్పించేలా చర్యలు చేపడతామని తెలిపారు. రైతులు తమ పంటను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విక్రయించే అవకాశం ఏర్పడుతుందన్నారు. కాఫీ రైతు బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. కాఫీ రైతులు ముందుకు వస్తే యూనిట్ వ్యయంలో 30 రాయితీతో యంత్ర పరికరాలను అందజేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క ట్రేడర్ తప్పనిసరిగా కాఫీ ట్రేడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగి ఉండాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన పార్చ్‌మెంట్ అందించాలని సూచించారు. అరకు, డుంబ్రిగుడ మండలాల్లో బెర్రీబోరర్ సోకిన పంట సేకరణలో, పల్పింగ్, డ్రైయింగ్ విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్రమ రవాణాను నిరోధించేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని జి.మాడుగుల, జీకే వీధి మండలాల్లో నిర్మిస్తున్న రెండు ఎకో పల్పింగ్ యూనిట్ల పనులను త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాదికి అందుబాటులో తేవాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు సూచించారు. చింతపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా ఎఫ్‌పీవోలు, ఆసక్తి గల ఎంటర్‌ప్రైజేస్‌లు లబ్ధి పొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణ శ్రీపూజ, జిల్లా ఉద్యాన వన, వ్యవసాయ శాఖ అధికారులు, కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు, రైతులు, కాఫీ ట్రేడర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్


