వణికిస్తున్న చలి
అధిక మంచు, శీతల గాలులతో తీవ్ర ఇబ్బందులు
రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
అరకులోయలో 3.6, జి.మాడుగులతోస 3.9 డిగ్రీలు నమోదు
హు..హు..హు... అహా..హ..హ
చింతపల్లి: జిల్లాలో చలి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు తీవ్రంగా కురుస్తూ.. శీతలగాలులు వీస్తుండడంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. చలి మంటలు కాగుతున్నా ఉపశమనం కలగడం లేదు. పిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. చిరు వ్యాపారులు, విద్యార్థులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.కాగా పర్యాటకులు క్యాంప్ ఫైర్‌లు వేసుకుని చలి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. సోమవారం అరకులోయలో 3.6 డిగ్రీలు, జి.మాడుగుల, డుంబ్రిగుడలలో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ హుకుంపేటలో 4.6 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 4.8, పాడేరులో 4.8, పెదబయలులో 6.1, చింతపల్లిలో 10.5, కొయ్యూరులో 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.6 డిగ్రీలు, మారేడుమిల్లిలో 13.2, రాజవొమ్మంగిలో 13.2, అడ్డతీగలలో 15.0, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు నమోదు కాగా, చింతూరు డివిజన్ చింతూరులో 14.5, ఎటపాకలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు. లంబసింగి, తాజంగి పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు చలి మంటలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం 9 గంటలు దాటే వరకూ పొగమంచు తీవ్రంగా కురుస్తోంది. మంచు ముసుగులో రహదారులు పూర్తిగా కనిపించక వాహన చోదకులు లైట్లు వేసుకుని నెమ్మదిగా నడపాల్సిన పరిస్థితి నెలకొంది.
జి.మాడుగుల: మండల కేంద్రం జి.మాడుగులలో ఆదివారం రాత్రి నుంచి చలి విజృంభించింది. సోమవారం ఉదయం 9గంటల వరకూ సూర్యోదయం కాలేదు. పొగ మంచు విపరీతంగా కురవడంతో రహదారులు పూర్తిగా కనిపించక వాహన చోదకులు లైట్లు వేసుకుని నెమ్మదిగా నడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ముంచంగిపుట్టు: మండలంలో సోమవారం చలి తీవ్రత అధికమైంది. పనులకు వెళ్లే కూలీలు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు,పెదబయలు వైపు వెళ్లే వాహనాదరులు హెడ్‌లైట్ వేసుకుని మంచులో అతికష్టం మీద రాకపోకలు సాగించారు.
వణికిస్తున్న చలి
వణికిస్తున్న చలి


