
కష్టాల కాలనీలు
రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాయి పోలవరం నిర్వాసితుల బతుకులు. సకల సౌకర్యాలు కల్పిస్తామని పదేళ్ల క్రితం ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. సర్వం త్యాగం చేసి ఊరొదిలి వచ్చిన వారు నాలుగేళ్లుగా నరకయాతన అనుభవిస్తూ కాలనీల్లో కాలం వెళ్లదీస్తున్నారు.
అసౌకర్యాల నీడలో పోలవరం నిర్వాసితులు
ఎటపాక: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా వీఆర్‌పురం మండలంలో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. జీడిగుప్ప, శ్రీరామగిరి గ్రామపంచాయతీల పరిధిలోని ములకపల్లి , కల్తునూరు, ఇప్పూరు, భీమవరం గ్రామాలకు చెందిన కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. అయితే వీరికోసం ఎటపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో 329 ఇళ్లను 39.17 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మించింది. ఒక్కో ఇంటికి ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఈకాలనీలో బడి, గుడి, పార్కు. బస్టాండ్, అంగన్‌వాడీ, కమ్యూనిటీ హాల్, ఆస్పత్రి తదితర భవనాలతో పాటు సీసీ రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలతో కాలనీ నిర్మిస్తామని నిర్వాసితులకు ఆశ చూపారు. కానీ గడిచిన పదేళ్లుగా నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. వారి సొంత గ్రామాల్లో భూములు కోల్పోయిన 80 మంది కొండరెడ్ల రెతులకు 120 ఎకరాల వ్యవసాయ భూమిని కన్నాయిగూడెం పంచాయతీలో ఇచ్చారు. ఈ కాలనీలో ప్రస్తుతం ములకపల్లి, కల్తునూరు, ఇప్పూరు గ్రామాలకు చెందిన 166 నిర్వాసిత కుటుంబాలు ఉంటున్నాయి. వీరిలో కొన్ని కుటుంబాలు గత నాలుగేళ్ల నుంచి దయనీయస్థితిలో కాలం గడుపుతున్నాయి.
సౌకర్యాల్లేక..
● సీసీ రోడ్లు లేక రహదారులన్ని పొదలు, పిచ్చి మొక్కలతో భయానకంగా ఉన్నాయి.
● డ్రైనేజీలు లేకపోవడంతో మురికి నీరంతా ఇళ్లముందు నిలిచిపోతోంది. రహదారులకు అడ్డంగా కాలువలు తీయడంతో మురుగు నీటితో నిండి ఉన్నాయి.
● ఈ కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఆధార్ కార్డు అడ్రస్‌లు మార్పు చేయకపోవడంతో ఉపాధి హామీ పథకం దూరమైంది. రైతులకు యూరియా, దాణా ఇవ్వడం లేదు. ఇక్కడ వారికి ఇచ్చిన భూముల పట్టాలు ఆన్‌లైన్లో ఎక్కించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకానికి దూరమవుతున్నారు.
● ఈ కాలనీలో కన్నాయిగూడెం పంచాయతీగా గుర్తించకపోవడంతో వీధి దీపాలు కూడా వేయడం లేదు. ఆధార్ కార్డు మార్పునకు పంచాయతీ కార్యదర్శి రూ.100 డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
● ఇక్కడ ఉండేవారికి రోగమొస్తే చూసేందుకు వైద్య సిబ్బంది ఎవరూ రారు. చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రం కూడా లేకపోవడంతో పౌష్టికాహారానికి దూరం అవుతున్నారు.
అటు ఇటు కాని బతుకులు
కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు
రహదారులు, వీధి దీపాలు లేక
ఇబ్బందులు
కలగానే ఆధార్ అడ్రస్ మార్పు
రేషన్ బియ్యం కోసం వ్యయ ప్రయాస
ముంపులోనే భూములు