
రైతులకు న్యాయం చేసిన తర్వాతే హైవే పనులు చేపట్టాలి
● పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు
● బాధిత గిరిజన రైతులతో కలిసి
ఐటీడీఏ వరకు ర్యాలీ
పాడేరు:
పాడేరు నియోజకవర్గం మీదుగా నిర్మిస్తున్న ఎన్‌హెచ్516–ఇ రహదారి కారణంగా గిరిజన రైతులు భారీ స్థాయిలో నష్టపోతున్నారని వారికి న్యాయం చేసిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత గిరిజన రైతులతో కలిసి స్థానిక క్యాంప్ కార్యాలయం నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీకే వీధి మండలం పెదవలస, రంపుల, చాపరాతిపాలెం, జి.మాడుగుల మండలం వంజరి, ములక్కాయపుట్టు, గెమ్మెలి పంచాయతీ వరిగెలపాలెం గ్రామాల్లో సుమారు 150 కుటుంబాల గిరిజన రైతులు ఎన్నో ఏళ్లుగా కాఫీ, మిరియాలు సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. ఈ గ్రామాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. తాము జాతీయ రహదారి నిర్మాణానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ బాధిత గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ఎంతోకొంత ముట్టజెప్పి చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదని చెప్పారు. బాధిత గిరిజన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు హైవే పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని ఆయన హెచ్చరించారు.

రైతులకు న్యాయం చేసిన తర్వాతే హైవే పనులు చేపట్టాలి