మూడో రోజూ నిఘా నీడలో
నక్కపల్లి: రాజయ్యపేటలో వరుసగా మూడో రోజు కూడా భారీ పోలీసు బందోబస్తు కొనసాగింది. బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన ఉద్యమం ఎప్పుడు ఏ విధంగా మారుతుందోనన్న ముందుజాగ్రత్తతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. మత్స్యకారుల వ్యూహాన్ని పోలీసు సిబ్బంది ముందుగా పసిగట్టలేకపోవడం వల్లే గ్రామంలోకి వచ్చిన హోంమంత్రిని అడ్డుకోవడం, ఆమె కాన్వాయ్‌కు అడ్డంగా తాటి, కొబ్బరి చెట్లు పడేసి ఘెరావ్ చేయడం, ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయరహదారిని ముట్టడించి నాలుగు గంటలపాటు ధర్నా చేసి ట్రాఫిక్‌ను స్తంభింపజేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా షాక్‌కు గురయింది. గ్రామంలోకి వచ్చి చర్చలు జరుపుతానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా మత్స్యకారులు శాంతించారు. అనివార్య కారణాల వల్ల కలెక్టర్ పర్యటన వాయిదా పడింది. మత్స్యకారులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి సుమారు వెయ్యిమందికి పైగా పోలీసులను రంగంలోకి దింపారు.
ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో బందోబస్తు
నర్సీపట్నం, అనకాపల్లి డీఎస్పీలు శ్రీనివాసరావు, శ్రావణిల ఆధ్వర్యంలో పోలీసులు రాజయ్యపేట పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగించారు. వీరు కాకుండా స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ సిబ్బంది కూడా రాజయ్యపేట పరిసరాల్లో ఉన్నారు. మఫ్టీలో కొంతమంది సిబ్బంది గ్రామంలో ఉంటూ మత్స్యకారుల కదలికలపై నిఘా పెట్టారు. గ్రామస్తుల సంభాషణలపై కూడా ఆరా తీస్తున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్దితిని సమీక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులంతా నక్కపల్లి, ఉపమాక, బోయపాడు, దొండవాక, హెటెరో కంపెనీ, తదితర ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసుకుని బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాజయ్యపేట వెళ్లే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల నంబర్లను సయితం నమోదు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పక్క గ్రామాల నుంచి ఎవరినీ రానీయకపోవడంతో రాజయ్యపేట మత్స్యకారులు మాత్రమే దీక్ష కొనసాగిస్తున్నారు. గ్రామంలోను, బల్క్ డ్రగ్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్ద మినహా మరెక్కడా గుంపులుగా ఉండడాన్ని అనుమతించడం లేదు. కలెక్టర్ వచ్చి వెళ్లిన తర్వాతే దీక్ష కొనసాగించడమా వద్దా అనేది ఇరు వర్గాలు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
22న ‘చలో రాజయ్యపేట’
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ఈ నెల 22న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చలో రాజయ్యపేట కార్యక్రమం నిర్వహించనున్నట్టు వీసం రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ ఆమర్‌నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కన్నబాబు, మాజీ ఎంపీ సత్యవతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తదితరులు హాజరవుతారన్నారు.
నిలిచిపోయిన బల్క్ డ్రగ్ పనులు
బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమం నేపథ్యంలో 15 రోజుల నుంచి పనులు నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లేబర్ వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ వ్యవహారం తేలే వరకు ఎక్కడా పనులు చేయడానికి వీల్లేదని మత్స్యకారులు డిమాండ్ చేసిన నేపథ్యంలో వారిలో ఆగ్రహావేశాలు చల్లార్చేందుకు తాత్కాలికంగా పనులు నిలిపివేశారు.
రాజయ్యపేట