
సమన్వయంతో గంజాయి సాగు నిర్మూలన
● ఎస్పీ అమిత్‌బర్దర్
● దేవీపట్నం పోలీసుస్టేషన్ సందర్శన
రంపచోడవరం: ఏజెన్సీలో గంజాయి సాగు, రవాణా నివారణకు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. దేవీపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆయన గురువారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పనితీరు, విచారణల పురోగతిని నేరుగా తనిఖీ చేసేందుకే ఆకస్మికంగా పర్యటన ఉద్దేశమన్నారు. పర్యటనలో భాగంగా ఎస్పీ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. వీటిలో నేరాల రిజిస్టర్,జనరల్ డైరీ, తీవ్రమైన నేరాలు, చిన్న నేరాలకు సంబంధించిన కేసు డైరీలు,ఎన్‌డీపీఎస్ కేసులను పరిశీలించారు. దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌కు కొత్తగా కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లతో మాట్లాడారు. త్వరగా పరిష్కరించాల్సిన పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీలో అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పరిపాలనకు జీరో టాలరెన్స్ పాలసీ ఉందన్నారు. గంజాయి పంటలను గుర్తించి నాశనం చేయడానికి పోలీస్,రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మత్తు పదార్దాల సాగు, అక్రమ వ్యాపారంలో పాల్గొనే వారిని కట్టడి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, దీని ద్వారా అక్రమ రవాణాను ఆదిలోనే ఆరికట్టవచ్చన్నారు. ఎస్పీ వెంట రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ ఉన్నారు.