
28.710 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం
● విలువ రూ.15 లక్షలు
● ముగ్గురు అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు వంతెన సమీపంలో చేపట్టిన తనిఖీల్లో 28.710 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ నెల 8 తేదీన నడిచి వస్తున్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేశామన్నారు.వారి బ్యాగుల్లో ఉన్న 28.710 కిలోల లిక్విడ్ గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతేకాకుండా వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మండలంలోని గోమంగి, ఒక్కరు చింతగరువు గ్రామానికి చెందిన వారని ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన ప్రధాన నిందితులను పట్టుకోవాల్సి ఉందన్నారు. స్వాధీనం చేసుకున్న లిక్విడ్ గంజాయి విలువ రూ.15 లక్షలు ఉంటుందన్నారు. ఇలావుండగా గతంలో లిక్విడ్ గంజాయి బాటిళ్లు, డబ్బాలతో తరలిచే స్మగ్లర్లు ఇప్పుడు కిలో చొప్పున పాలిథిన్ కవర్లలో ప్యాకింగ్ చేసి తరలిస్తున్నారు.
విశాఖ రైల్వేస్టేషన్‌లో...
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం రైల్వే పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ జీఆర్‌పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ప్లాట్‌ఫాంలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లాకు చెందిన శశాంక్ జితేంద్ర చౌహాన్, శంకర్ ప్రభురెడ్డి..ముంబైకి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1,92,400 విలువైన 38.48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

28.710 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం