జేసీ అభిషేక్ గౌడ ఆదేశం
సాక్షి,పాడేరు: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికపరంగా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి ఽసంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్‌లో ధాన్యం సేకరించాలని సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులంతా రైతు సేవా కేంద్రాలు, నిల్వ గోదాంలను తనిఖీలు చేసి, ఖాళీ స్థలాలు, వాటి సమగ్ర వివరాలపై నివేదికలు అందజేయాలన్నారు. తూనికలు కొలతలశాఖ అధికారులు కూడా తూకం యంత్రాలను పరిశీలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వర్షాలకు ధాన్యం తడవకుండా ప్రతి మండల స్టాక్ పాయింట్ పరిధిలో 100కు పైగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో రాగుల కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం మోహన్‌బాబు, రవాణాశాఖ అధికారి మోహన్‌బాబు, జిల్లా సహకారశాఖ అధికారి రామకృష్టంరాజు పాల్గొన్నారు.