
గిరిజనేతరులకు మీటర్ల మంజూరు వద్దు
● ఆదివాసీ జేఏసీ ప్రతినిధుల వినతి
చింతూరు: ఏజన్సీ ప్రాంతమైన చింతూరు డివిజన్లో గిరిజనేతరులకు విద్యుత్ మీటర్ల మంజూరును నిలిపివేయాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ డివిజన్లోని నాలుగు మండలాల్లో గిరజనేతరుల వలసలు ఎక్కువయ్యాయన్నారు. వారికి ఇక్కడి భూములు, ఇళ్లపై ఎలాంటి హక్కులు లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి అధికారులు విద్యుత్ మీటర్లు ఎలా మంజూరు చేస్తున్నారని, ఇకపై గిరిజనేతరులకు మీటర్లు మంజూరు చేయకుండా చర్యలు చేపట్టాలని పీవోను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మండల చైర్మన్ పొడియం రామకృష్ణ, కారం సాయిబాబు, కాక సీతారామయ్య, కారం చంద్రయ్య, సుబ్బయ్య పాల్గొన్నారు.