
పిడుగుపాటుకు పశువులు, మేకలు మృతి
పెదబయలు: మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ కోదువలసలో పిడుగుపాటుకు 20 పశువులు మృతి చెందాయి.బుధవారం కోదువలస పెద్ద చెరువు సమీపంలో పశువుల మేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఇదే సమయంలో పిడుగుపడి 22 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని లక్ష్మీపేట సర్పంచ్ లకే అశోక్‌కుమార్ తెలిపారు. మృతి చెందిన వాటిలో కొర్ర బంగారయ్య, కిల్లో బాలరాజు, కిల్లో శ్రీనుబాబు, కిల్లో సత్యారావు, కిల్లో మల్లేష్, వంతాల రాంప్రసాద్, వంతాల రాజారావు, కిల్లో వెంకటరావు, కిల్లో బంగారన్న చెందిన పశువులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ఐటీడీఏ స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. పిడుగుపాటుకు మృతిచెందిన పశువులకు పోస్టుమార్టం నిర్వహించి డీహెచ్‌వోకు నివేదించి రైతులకు సహకారం అందించేందుకు కృషి చేస్తామని పశుసంవర్థకశాఖ స్థానిక ఏడీ కిషోర్ తెలిపారు.
చింతపల్లి: మండలంలోని తాజంగిలోని టిక్కరిపాడు వీధిలో తాడిపూడి లక్ష్మణరావుకు చెందిన 13 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. బుధవారం గ్రామానికి సమీపంలోని వాటిని మేతకు తీసుకువెళ్లాడు. ఉరుములతో కూడిన వర్షానికి అవి తాజంగిలో నిర్మాణదశలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం ఎదురుగా ఉన్న చెట్టు వద్దకు చేరుకున్నాయి. అదే సమయంలో పిడుగుపాటుకు మేకలన్నీ మృతి చెందాయి. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరాడు.