
నీరుగారిన లక్ష్యం
● చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్న మొక్కలు
● రైతులకు పంపిణీకి నోచుకోని వైనం
● చోద్యం చూస్తున్న ఉపాధి అధికారులు
పాడేరు రూరల్: రైతులకు మొక్కలను పంపిణీ చేయకుండా సిబ్బంది చెత్త కుప్పల్లో పారవేస్తున్నారని, దీంతో ఉపాధి హామీ పథకం నీరుగారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని శివారు సలుగు పంచాయతీలో ఉపాధి హమీ పథం ద్వారా అర్హూలైన రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వివిధ రకాల మొక్కలను సమీప పొదల్లో పారవేస్తున్నారు. శివారు గ్రామల్లో ఇదే తంతుగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధి హామీ పథకం లక్ష్మం నీరుగారుతోందని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉపాధి హమీ పథకం ద్వారా రైతులకు విస్తృతంగా మొక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు మొక్కలను పంపిణీ చేయకుండా సిబ్బంది వృథాగా పక్కన పడేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మొక్కల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.