
వదలని వరద
చింతూరు మండలం ఏజీకొడేరు వద్ద నీటమునిగిన బస్‌షెల్టర్
చింతూరు, కంసులూరు రహదారిపై నిలిచిఉన్న వరదనీరు
చింతూరు: గోదావరి, శబరి నదుల నీటిమట్టం క్రమేపీ తగ్గుతున్నా విలీన మండలాల్లో మాత్రం వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. వాగులు ఎగదన్నడంతో చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల్లో నిలిచిపోయిన రాకపోకలు కొనసాగడం లేదు. రవాణా సౌకర్యం లేకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
● భద్రాచలం వద్ద గరిష్టంగా మంగళవారం రాత్రి 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ బుధవారం రాత్రికి 44 అడుగులకు చేరింది. నీటిమట్టం 48 అడుగులకంటే తగ్గడంతో బుధవారం తెల్లవారుజామున అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
● మళ్లీ తుఫాను ప్రభావంతో గురువారం నుంచి భారీవర్షాలు కురుస్తాయన్న సమాచారంతో నదీ పరివాహక గ్రామాల ప్రజల్లో మరోమారు ఆందోళన నెలకొంది. ఇప్పటికే వరుస వరదలతో రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా రహదారులు మూసుకుపోయిన గ్రామాలకు కూడా పరిహారం అందించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
● కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో చాలాచోట్ల రహదారులు ఇంకా జలదిగ్బంధంలోనే వున్నాయి. బుధవారం రాత్రికి కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 46 అడుగులు, చింతూరు వద్ద శబరినది నీటిమట్టం 34 అడుగులుగా ఉంది.
● చింతూరు మండలంలో శబరినది తగ్గుతున్నా వాగులనీరు ఇంకా రహదారులను వీడలేదు. కుయిగూరువాగు తగ్గకపోవడంతో బుధవారం కూడా ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు కొనసాగడం లేదు. దీంతోపాటు జల్లివారిగూడెం, సోకిలేరు, చంద్రవంక, చీకటివాగుల వరద కారణంగా చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ, మండలంలోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు
ముంపు ప్రాంతాల్లో అరకొర సౌకర్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం వారపు సంత, గురువారం దసరా పండగ నేపథ్యంలో చింతూరు వచ్చేందుకు సోకిలేరువాగు ఆవలనున్న గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో నర్సింగపేట వద్ద పడవ వద్దకు వచ్చారు. అధికారులు అక్కడ కేవలం ఒక్క పడవ మాత్రమే ఏర్పాటు చేయడంతో వారు ఇబ్బందులు పడ్డారు. పడవలో ఎక్కేందుకు అధికసంఖ్యలో ప్రజలు ఎగబడడంతో రద్దీ నెలకొంది. పరిమితికి మించి ఎక్కేందుకు పోటీ పడడంతో పడవ యజమానులు కూడా ఆందోళనకు గురయ్యారు.
కూనవరం: శబరి, గోదావరి నదులకు బుధవారం కూనవరం వద్ద వరద పోటెత్తింది.కూనవరం – భద్రాచలం ప్రధాన రహదారిపై పోలిపాక వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో రాకపోకలు కొనసాగలేదు. ఉదయ భాస్కర్ కాలనీ, గిన్నెల బజారులోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. ఈ ప్రాంతంలోని 50 కుటుంబాలను టేకులబోరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు తరలించినట్టు తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు తెలిపారు. పోలీసుస్టేషన్ మైదానం, ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా వరద ప్రవాహం ముంచెత్తింది.కూనవరం– చింతూరు మార్గంలో పంద్రాజుపల్లి వద్ద వరదనీరు రోడ్డుపైకి ఎక్కడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండ్రాజుపేట రహదారిపై వరదనీరు వారం రోజులుగా తగ్గుముఖం పట్టకపోవడంతో కొండ్రాజుపేట, వాల్ఫర్డ్‌పేట, శబరి కొత్తగూడెం, పూసుగూడెం, కొత్తూరు, శ్రీరామపురం, ఆంబోతులగూడెం, జిన్నెలగూడెం, బండారు గూడెం, పెదార్కూరు క్రింది గుంపు ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అంతరాయం ఏర్పడింది.
గోదావరి వరదల చరిత్రలో రికార్డ్
గోదావరి వరదల చరిత్రలో ఈ ఏడాది ఓ రికార్డుగా మిగిలిపోనుంది. 1976 నుంచి వరదల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఇప్పటికే గోదావరికి ఎనిమిది పర్యాయాలు వరదవచ్చింది. ఈసారి వరదలు మొదటి హెచ్చరిక స్థాయి నుంచి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కొనసాగాయి. ఈ పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని జలవనరులశాఖ అధికారులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన పాతతరం వాళ్లు అంటున్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఈ ఏడాది గోదావరి వరద పెద్ద ఎత్తున రాగా పోలవరం కాపర్ డ్యాం కారణంగా విలీన మండలాలపై అధిక ప్రభావం చూపింది. ఈ ఏడాది జూన్ 12న ప్రారంభమైన వరద ప్రభావం అక్టోబరు వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గరిష్టంగా 51.9 అడుగులు, కనిష్టంగా 41.3 అడుగులుగా నమోదైంది.
భద్రాచలం వద్ద వరద నీటిమట్టం వివరాలు
తేదీ అడుగులు
జూలై 12 41.30
ఆగస్టు 20 45.00
ఆగస్టు 21 51.90
ఆగస్టు 29 45.00
ఆగస్టు 31 48.00
సెప్టెంబర్ 3 43.30
సెప్టెంబర్ 27 46.60
సెప్టెంబర్ 30 50.00
గోదావరి, శబరి నదులు శాంతించినా తగ్గని ప్రభావం
భద్రాచలం వద్ద 50 నుంచి
44 అడుగులకు తగ్గిన నీటిమట్టం
రెండో ప్రమాద హెచ్చరికను
ఉపసంహరించిన అధికారులు
తగ్గని వాగుల ఉధృతి
విలీన మండలాల్లో ముంపులోనే దారులు
కొనసాగని రాకపోకలు

వదలని వరద

వదలని వరద

వదలని వరద

వదలని వరద

వదలని వరద