
నరకం చూస్తున్నాం.. ఆదుకోండి
గోదావరి, శబరి నదుల వరద వల్ల వాగులు గ్రామాలను చుట్టుముట్టడంతో రహదారులు నీటమునిగాయి. దీంతో ప్రజలు ఐదు రోజులుగా గ్రామాలను వీడి రాలేని పరిస్థితి. ఉన్నకాడికి నిత్యావసర వస్తువులు అయిపోవడంతో తెచ్చుకోలేని దుస్థితిలో అష్టకష్టాలు పడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందక దయనీయ స్థితిలో కాలం గడుపుతున్నారు.
చింతూరు: మండలంలోని సోకిలేరు, జల్లివారిగూడెం వాగుల అవతల ఉన్న నర్సింగపేట, ముకునూరు, రామన్నపాలెం, పెదశీతనపల్లి, బొడ్రాయిగూడెం, కొండపల్లి, చినశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు ఉలుమూరు, మల్లెతోట గ్రామాల్లో ప్రజలు దయనీయస్థితిలో జీవనం సాగిస్తున్నారు. వీరు ఏదైనా పనిమీద చింతూరు రావాలంటే అష్టకష్టాలు, వ్యయప్రయాసలు తప్పడం లేదు.
● వరదల వల్ల ఆర్థికంగా నష్టపోయారు. వరి, పత్తి, మిరప పంటలు, పొగాకు నారుమళ్లు ముంచెత్తడంతో పెట్టుబడులు దక్కని పరిస్థితి. చాలాచోట్ల పొలాలు నదులను తలపిస్తున్నాయి. ఈ ఏడాది వరుస వరదలతో ఎన్నడూలేని విధంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీఆర్‌పురం: గోదావరి వరదలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రీరామగిరి, గుండుగూడెం, వడ్డుగూడెం, వడ్డుగూడెం కాలనీలో ఇళ్లు, సుమారు 500 ఎకరాల్లో వరినాట్లు నీటమునిగాయి. వరదలు సంభవించిన మూడు నెలల వ్యవధిలో ఒక్కసారి మాత్రమే నిత్యావసరాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బియ్యం కూడా ఇవ్వలేదని వాపోతున్నారు.
ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం
వారంక్రితం ముకునూరు నుంచి పుట్టింటికి మోతుగూడెం వెళ్లా. ఇంతలో వరద వచ్చింది. రహదారి మునిగిపోవడంతో ఆటోల్లో చుట్టూ తిరిగి కాలినడకన వరద దాటి పడవపై గ్రామానికి చేరుకున్నా. – సున్నం సుభద్ర,
ముకునూరు, చింతూరు మండలం
పంటంతా నాశనమైంది
వరద రాదని ఊహించి రెండెకరాల్లో వరి సాగు చేపట్టా. నారుమడి, యా త, ఎరువులకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టా. పొలం అంతా మునిగిపోయింది. ఈ ఏడాది తిండిగింజలు కష్టమే.
– సవలం రామకృష్ణ,
చూటూరు, చింతూరు మండలం
అధికారులు పట్టించుకోలేదు
వరద నీరు చుట్టుముట్టడంతో ఐదు రోజులుగా గ్రామం నుంచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. నిత్యావసర సరకులు నిండుకోవడంతో అందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు.
– ఎండీ జబ్బార్,
ఏజీకొడేరు, చింతూరు మండలం
మొత్తం మునిగిపోయింది
వరద రాదనే ఊహించి ఎకరా భూమిలో వరినాట్లు వేశా. ఇప్పుడొచ్చిన వచ్చిన వరద మొత్తం ముంచేసింది. ఇప్పటి వరకు ఖర్చుపెట్టిన రూ.30 వేల పెట్టుబడి మొత్తం వరదపాలైంది.
– పాయం పుల్లమ్మ,
చూటూరు, చింతూరు మండలం
పరిహారం ఇస్తే వెళ్లిపోతాం
ప్రతిఏటా వరదల సమయంలో ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా త్వరితగతిన పోలవరం పరిహారం అందించి పునరావాసం కల్పిస్తే వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నాం
– అగరం సుబ్బలక్ష్మి, సర్పంచ్,
ఏజీకొడేరు, చింతూరు మండలం
ఆస్పత్రికి వెళ్లేందుకు అవస్థలు
కాళ్లవాపు రావడంతో అత్య వసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సివచ్చింది. పడవపై సోకి లేరువాగు దాటి ఆటోలో వెళ్లి చింతూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇబ్బందులు పడుతూ తిరిగి ఇంటికి బయలుదేరా.
– గాలె కన్నారావు,
రామన్నపాలెం, చింతూరు మండలం
వరదనీరు చుట్టుముట్టడంతో
ఇళ్లకే పరిమితం
కనీసం నిత్యావసరాలు
తెచ్చుకోలేని దుస్థితి
పట్టించుకోని అధికార యంత్రాంగం
సాయం అందక ఇబ్బందులు
వరద ప్రభావిత ప్రాంతాల్లో
బాధితుల ఆవేదన
కనీసం పోలవరం పరిహారమైనా
ఇచ్చి తరలించాలని వేడుకోలు

నరకం చూస్తున్నాం.. ఆదుకోండి

నరకం చూస్తున్నాం.. ఆదుకోండి

నరకం చూస్తున్నాం.. ఆదుకోండి

నరకం చూస్తున్నాం.. ఆదుకోండి

నరకం చూస్తున్నాం.. ఆదుకోండి

నరకం చూస్తున్నాం.. ఆదుకోండి